AP: ఏపీ ఉప సభాపతిగా రఘురామకృష్ణ రాజు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌ల నియామకంపై ఉత్కంఠ తొలగింది. ఏపీ శాసనసభలో చీఫ్ విప్‌గా టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియమితులయ్యారు. శాసన మండలిలో చీఫ్‌విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధలను ఏపీ ప్రభుత్వం నియమించింది. శాసనసభలో మిత్రపక్షాలు జనసేన నుంచి ముగ్గురు, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్ లుగా సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
ఉప సభాపతిగా రఘురామ
మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శాసనసభ ఉప సభాపతి హోదాలో ‘అధ్యక్షా...’ అని పిలిపించుకోనున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో ఈ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ఆ పార్టీ సభ్యులు సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో... ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక లాంఛనమే కానుంది. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి... నరసాపురం ఎంపీ అయ్యారు. కొద్దికాలానికే జగన్ వైఖరితో విసిగి వేసారి పోయారు. ‘వైసీపీ రెబల్ ఎంపీ’గా నిత్యం జగన్‌పై ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రఘురామను సీఐడీ అరెస్టు చేయడం, కస్టడీలో తీవ్రంగా హింసించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. గత ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు. ఆయనను తిరిగి లోక్‌సభకు పంపించాలని భావించినా... కూటమిలో సమీకరణలు, సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో... రఘురామను ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టారు. కూటమి ఘన విజయం అనంతరం ఆయనకు సముచిత గౌరవం లభిస్తుందని అంతా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప సభాపతి పదవికి ఎంపిక చేశారు.
శాసనసభలో విప్‌లు వీరే..
- అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)
- ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(బీజేపీ)
- బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం (టీడీపీ)
- బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
- బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)
- బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)
- యనమల దివ్య- తుని (టీడీపీ)
- దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (టీడీపీ)
- కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
- వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (టీడీపీ)
- మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
- జగదీశ్వరి తోయక - కురుపాం(ఎస్టీ) (టీడీపీ)
- పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్(టీడీపీ)
- తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
- యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ)
ఏపీ శాసన మండలిలో విప్‌లు
- పి.హరిప్రసాద్ (జనసేన)
- వేపాడ చిరంజీవి రావు(టీడీపీ)
- కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com