AP Panchayat Funds : గ్రామ పంచాయతీలకు మరో షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

AP Panchayat Funds : ఏపీలో గ్రామ పంచాయతీలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కారు. అనేక పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఖాళీ చేసింది. ఇది తెలుసుకున్న సర్పంచులు అవాక్కయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా వెచ్చిద్దామని ప్రణాళికలు వేసుకుంటున్న దశలో తాజా పరిణామంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా రూ.965 కోట్లకు పైగా జమయ్యాయి.
పలు పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులు తగ్గిపోగా, ఇంకొన్నింటిలో 'జీరో' చూపిస్తున్నట్లు సర్పంచులు గుర్తించారు. ఎన్ని పంచాయతీల నుంచి నిధులు వెనక్కి తీశారు? ఈ మొత్తం ఎంత? ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు? అన్న ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల వద్దా జవాబు లేదు. విద్యుత్తు బకాయిల కింద 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో దాదాపు 345 కోట్లు వెనక్కితీసి విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించారు. తాజా నిర్ణయం కూడా అలాంటిదేనా? లేక ప్రభుత్వం మళ్లించిందా? అన్నది స్పష్టత లేదు.
జగన్ సర్కారు నిర్వాకంపై మండిపడుతున్నారు గ్రామ సర్పంచులు. గుంటూరు జిల్లా వట్టి చెరువ మండలంలోని గ్రామ సర్పంచులు... భిక్షాటన చేశారు. 14,15 ఫైనాన్స్ నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులను... ఈ నిధుల్ని తీసుకునే హక్కు రాష్ట్రప్రభుత్వానికి లేదంటున్నారు.
నిధులు లేకపోతే... అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వర్షాలు అధికంగా పడుతున్న ఈ సమయంలో.. బ్లీచింగ్ చల్లేందుకు, డ్రైనేజీలు క్లీన్ చేసేందుకు కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిధులను... తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు సర్పంచులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com