AP government: బెర్మ్ పార్క్ బ్యాంకులో పెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పు..

AP government: బెర్మ్ పార్క్ బ్యాంకులో పెట్టి..  ఏపీ ప్రభుత్వం అప్పు..
AP government: ఉన్న ఆస్తుల్ని తాకట్టుపెట్టాల్సిందిన అవసరం ఏమొచ్చిందంటే దానికి టూరిజం డిపార్ట్‌మెంట్‌ వాదన కూడా చిత్రంగానే ఉంది.

Ap Government: ఓపక్క అందినకాడల్లా అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. కంటికి కనిపించిన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేస్తోంది. గతంలో విశాఖలో కొన్నింటిని తనఖాపెడితే ఈసారి విజయవాడలోని పార్క్‌ వంతు వచ్చింది. కృష్ణా నది ఒడ్డున ఉన్న బెర్మ్‌ పార్క్‌ పేరు చెప్పి ఈసారి 143 కోట్ల రూపాయల అప్పు తెస్తున్నారు.

తొలి విడత రుణం 35 కోట్లు వారం రోజుల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ 5 ఎకరాల పార్క్‌ను బ్యాంక్‌ షూరిటీగా పెట్టి లోన్‌ తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. APTDC అధికారులు మౌనంగా తమ పని తాము చేసుకెళ్తున్నారు. ఈ బెర్మ్‌ పార్క్‌ను HDFCకి తాకట్టు పెట్టి ఈ మొత్తం అప్పు తెస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తైపోయింది.

ఉన్న ఆస్తుల్ని తాకట్టుపెట్టాల్సిందిన అవసరం ఏమొచ్చిందంటే దానికి టూరిజం డిపార్ట్‌మెంట్‌ వాదన కూడా చిత్రంగానే ఉంది. పర్యాటక శాఖ గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులన్నీ కొన్నాళ్లుగా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇవి పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.

ప్రతిచోటా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు తెగేసి చెప్పారు. దీంతో.. తప్పనిసరై ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టి పనులు పూర్తి చేస్తామని APTDC చెప్తోంది. ఇప్పుడు ఇచ్చే అప్పుతో హోటళ్లు, రిసార్టులను ఆధునికీకరిస్తామని HDFCకి తెలిపింది.

ప్రభుత్వానికి అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టే దుస్థితి వచ్చింది. తాజాగా APTDCకి చెందిన ఈ బెర్మ్‌ పార్క్‌ తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారట. గతంలో లంబసింగి, బొర్రా గుహలు ప్రాంతాల్లో టూరిజం విస్తరణకు అనేక పనులు చేపట్టారు.

అలాగే అహోబిలంలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన చేయాలనుకున్నారు. గండికోట, కోటప్పకొండ వద్ద రోప్‌వే, ఇడుపులపాయలో రాజీవ్‌ నాలెడ్జ్‌ వ్యాలీ పని అన్నీ పెండింగ్‌లో పడడంతో.. వీటిని ఎలా పూర్తి చేయాలో అర్థంకాక చివరికి ఈ తాకట్టు మార్గాన్ని ఎంచుకున్నారు.

ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో చివరికిలా చేయాల్సిన పరిస్థితులు రావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న అప్పు 145 కోట్లకు సంబధించిన వడ్డీ, EMIల విషయాలన్నీ ఉన్నతాధికారులు రహస్యంగానే ఉంచుతున్నారు.

విజయవాడలోని ఈ బెర్మ్‌ పార్క్‌ను ఆనుకునే బోటింగ్‌ పాయింట్‌ ఉంటుంది. పర్యాటకులు భవానీ ద్వీపానికి ఇక్కడి నుంచే వెళ్తుంటారు. అలాగే ఇక్కడి హోటల్‌ రూమ్స్‌కి కూడా మంచి గిరాకీ ఉంటుంది. మీటింగ్‌ హాల్‌లోనూ రెగ్యులర్‌గా ప్రైవేట్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్లేస్‌ను తాకట్టు పెట్టి అప్పు తేవడం ఏంటో టూరిజం అధికారులకే తెలియాలి.

Tags

Read MoreRead Less
Next Story