AP movie ticket price : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో..!

AP  movie ticket price : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో..!
AP movie ticket price : తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టికెట్ల ధరల వివాదానికి ఏపీలో పుల్‌స్టాప్ పడింది.

AP Tickets price : తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టికెట్ల ధరల వివాదానికి ఏపీలో పుల్‌స్టాప్ పడింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లు సర్కారు వర్సెస్ సినిమాగా సాగుతున్న వ్యవహారానికి తెరపడింది.

ఇక.. మున్సిపల్ కార్పొరేషన్లలో నాన్ ఏసీ థియేటర్లలో 60, 40 రూపాయలు, ఏసీ థియేటర్లలో 100, 70 రూపాయలు, స్పెషల్ థియేటర్లలో 125, 100 రూపాయలుగా టికెట్‌ ధరలు నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు 150, రిక్లయినర్ సీట్లు 250 రూపాయలుగా పేర్కొన్నారు. మున్సిపాలిటీలో నాన్ ఏసీ థియేటర్లలో 50, 30 రూపాయలు, ఏసీ థియేటర్లలో 80, 60 రూపాయలు, స్పెషల్ థియేటర్లలో 100, 80గా ధరలు నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు 125, రిక్లయినర్ సీట్లు 250 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. నగర/గ్రామ పంచాయతీలో నాన్ ఏసీ థియేటర్లలో 40, 20 రూపాయలు, ఏసీ థియేటర్లలో 70, 50 ధర కాగా.. స్పెషల్ థియేటర్లలో 90, 70 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు 100, రిక్లయినర్ సీట్లు 250 రూపాయలుగా నిర్ణయించారు.

ఈ టికెట్ల ధరలకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇది వంద కోట్లు, అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు వర్తిస్తుంది. అయితే ఇక్కడో షరతు విధించింది ప్రభుత్వం. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అటు.. చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి సినీ ప్రముఖులకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. గత నెలలో మెగాస్టార్ చిరంజీవితో సహా సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సీఎం జగన్‌తో సమాశమై చర్చించారు. వారి అభ్యర్థనతో సినిమా టికెట్ల రేట్లపై కొత్త జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కాస్తా ఆలస్యమైనా కొత్త జీవో వచ్చేసింది. ఈ నిర్ణయంతో త్వరలో విడుద‌ల కాబోతున్న రాధేశ్యామ్‌తో పాటు మిగిలిన చిత్రాల‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story