Andhra Pradesh: న్యూఇయర్‌ వేడుకలు.. ఏపీలో పలు ఆంక్షలు

Andhra Pradesh: న్యూఇయర్‌ వేడుకలు.. ఏపీలో పలు ఆంక్షలు
Andhra Pradesh: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో ఏపీలోనూ పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

Andhra Pradesh: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో ఏపీలోనూ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని కోరారు. నగరంలో ఆరు బయట వేడుకలకు అనుమతులు లేవని... బహిరంగ ప్రదేశాల్లో అయిదుగురు లేదా అంతకు మించి జనం గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.


మహాత్మా గాంధీ రోడ్డు, కారల్‌ మార్క్స్‌ రోడ్డు, బి.ఆర్‌.టి.ఎస్‌.రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బెంజి సర్కిల్‌ పైవంతెన, కనకదుర్గా ఫ్లైఓవర్‌, పాత పీసీఆర్‌ వంతెనలపై వాహనాలను అనుమతించరు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరన్నారు. నిర్వాహకులు సామాజిక దూరం, ఇతర కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్‌ కెపాసిటీలో 60 శాతం మాత్రమే అనుమతించాలని సూచించారు. ఆరుబయట ప్రదేశాల్లో డీజేలు, ఎక్కువ శబ్దం వచ్చే సౌండ్‌ సిస్టమ్‌ను వినియోగించొద్దని.. మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపొద్దన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంపులుగా రోడ్లపై చేరి కేక్‌లు కోసి అల్లర్లు చేస్తే సహించేది లేదన్నారు. ఇవాళ రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగొద్దన్నారు.


హద్దు మీరితే ఎవరినీ ఉపేక్షించబోమన్నారు పోలీసులు. ఇవాళ రాత్రి విజయవాడలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ద్విచక్రవాహలను సైలన్సర్లు తొలగించి నడపటం, బాణసంచా కాల్చటం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.


అటు.. విశాఖలోనూ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్కే బీచ్ రోడ్‌లో పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు. స్టార్ హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి ఒంటిగంట వరకే నిర్వహించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దొరికితే నిర్వాహకులపైనా కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలతో ఎక్కువమంది సిబ్బందితో, ఎక్కువ ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విశాఖ సీపీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story