Ruia Hospital: తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్.. RMOను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Ruia Hospital:  తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్.. RMOను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
రుయాలో అంబులెన్సుల మాఫియా నిజమేనని అధికారులు తేల్చారు. ఘటన జరిగిన అనంతరం ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం

Ruia Hospital : రుయాలో అంబులెన్సుల మాఫియా నిజమేనని అధికారులు తేల్చారు. ఘటన జరిగిన అనంతరం ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణ జరిపిన ఈ బృందం.. రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్సుల దందా వాస్తవమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో ఇదేం రాక్షసత్వమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. శవాలపై పేలాలు ఏరుకుంటారా..? ప్రాణానికి ఖరీదు కడతారా..? అంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందా..? రుయా లాంటి ఘటనలు జరగకుండా ముందే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీస్తున్నారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటన, తిరుపతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సుల సిండికేట్‌ దందాకు కారకులెవరు..? అధికారుల నిర్లక్ష్యం కాదా..? ఇన్ని రోజులుగా దోపిడీ జరుగుతున్నా అధికారుల దృష్టికి ఒక్కసారి కూడా రాలేదా..? వస్తే అధికారులు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించారు..? ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన అంబులెన్స్‌ల అరాచకానికి అడ్డుకట్ట పడుతుందా..? ఎంత అంబులెన్స్‌ అయితే మాత్రం కిలోమీటరుకు 180 రూపాయలా వసూలు చేస్తారా..? అంబులెన్స్‌ల సిండికేట్‌కు చెక్‌ పెట్టేదెవరు..? ఈ అంబులెన్స్‌ల అరాచకానికి అంతం పడేదెప్పుడు..?

ఇక రూయా, స్విమ్స్‌లోనే ఈ తరహా పరిస్థితులుంటే.. రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వాసుపత్రుల్లో మాటేంటి..? అసలు పేదలు వచ్చే ఆస్పత్రుల దగ్గర ఈ ప్రైవేట్ అంబులెన్స్‌ల దోపిడీ ఏంటి..? శవాల సాక్షిగా బాధితుల నుంచి డబ్బు గుంజే దందా ఇంకెన్నాళ్లు..? కుయ్‌ కుయ్‌ అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే అంబులెన్సుల ఆధునీకరణ తమ ప్రభుత్వ ఘనత అంటూ చెప్పుకున్నారు. రుయా ఘటన చూశాక ఇదేనా ప్రభుత్వ ఘనత..? రుయాలో అంబులెన్సుల మాఫియాపై ముందు నుంచి ప్రభుత్వం యాక్షన్‌ తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ప్రభుత్వాసుపత్రులను మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వాసుపత్రులు అవినీతి, లంచగొండితనం, నిర్లక్ష్యానికి ఆలవాలంగా మారుతుంది. ప్రైవేట్ అంబులెన్సుల మాఫియా సచ్చినా వదలరు. శవాలతో వ్యాపారం చేస్తూ బాధితుల్ని పీక్కు తింటూనే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story