AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించిన ఏపీ ప్రభుత్వం.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

AP 3 Capitals Bill: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు.
మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే బాటలో వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, అమరావతికి మద్దతుగా వెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా ఆదేశాలు జారీ చేశారు.
బీజేపీ నేతలకు అమిత్‌షా ఆదేశాల నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ ప్లాన్ మారిందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది. ఉన్నట్టుండి మూడు రాజధానులపై వెనక్కి తగ్గడానికి కారణాలేంటనే దానిపై ప్రభుత్వం గాని, వైసీపీ నేతలు గాని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అమరావతిపై హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com