AP: సజ్జలకు రెండు చోట్ల ఓట్లు

AP: సజ్జలకు రెండు చోట్ల ఓట్లు
భగ్గుమన్న ప్రతిపక్షాలు... అక్రమ ఓట్లను నిదర్శనమని ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు... మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉండటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యలు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ట్రీ పార్కు విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే .. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని.. 31వ పోలింగ్‌ కేంద్రంలో క్రమ సంఖ్య 799, 800, 801, 802లో సజ్జల లక్ష్మి, రామకృష్ణారెడ్డి సజ్జల, భార్గవ సజ్జల, నవ్య మోతే కొత్తగా ఓట్లు పొందారు. అదేవిధంగా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పోలింగ్‌బూత్‌ 132లోనూ వరుస సంఖ్య 1089, 1090, 1091, 1105లోనూ.. ఈ నలుగురుకు ఓటుహక్కు వచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో ఇంటిసంఖ్య వద్ద A-85గా నమోదు చేసిన అధికారులు ... పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పేరు ఎదురుగా వారి పేర్లు నమోదు చేయటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.


సజ్జల కోడలు నవ్య మోతేకు మాత్రం రెండుచోట్లా విల్లా ఏ-85, రెయిన్‌ ట్రీపార్కు చిరునామాతో సహా ఓటుహక్కు కల్పించారు. చిన్న తేడాలతో రెండుచోట్ల ఓటుహక్కు పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ల ఇళ్లకు యంత్రాంగం వెళ్లి విచారణ చేసిన తరువాత ఓటు మంజూరు చేస్తారు. సజ్జల కుటుంబం విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ఓటుహక్కు ఇచ్చారా? లేదా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున వారిని అడగకుండానే ఓట్లు నమోదుచేశారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో చాలాచోట్ల వైకాపా నేతలు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారు.


సజ్జల రామకృష్ణారెడ్డికి రెండుచోట్ల ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. అలాగే సీఎం క్యాంపు కార్యాలయ పనిచేసే సిబ్బందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ...సామాజిక మాధ్యమాల్లో ధూళిపాళ్ల పోస్ట్ చేశారు. పొన్నూరులో ఒకటి, మంగళగిరిలో మరొక ఓటు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారలకు ఫిర్యాదు చేస్తామని ధూళిపాళ్ల తెలిపారు. రెండుచోట్లు ఓట్లతో సలహాలరెడ్డి దొరికిపోయారని వ్యాఖ్యానించారు. పొన్నూరులో ఒకఓటు, మంగళగిరిలో మరో ఓటు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పెదకాకాని తహసీల్దార్‌ రత్నంను వివరణ కోరగా సజ్జల కుటుంబం కొత్త ఓట్ల కోసం పొరపాటుగా నంబూరు గ్రామంలో దరఖాస్తు చేసుకుని ఓటు పొందారు. దీనిని గుర్తించి నలుగురి ఓట్లు తొలగించటానికి వెంటనే ఫారం-7 పెట్టాం. రాబోయే ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఉండవని తెలిపారు. అయితే సజ్జల కుటుంబం నంబూరు గ్రామంలో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోగా బీఎల్‌వో గుర్తించి ఈ ఓట్లు మంగళగిరి నియోజకవర్గానికి చెందినవని రిమార్కు నమోదుచేసినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story