AP News:వైకాపా సేవలో మునిగితేలుతున్న అధికారులు

AP News:వైకాపా సేవలో మునిగితేలుతున్న అధికారులు

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులు... వైకాపా సేవలో మునిగితేలుతున్నారు. వైకాపా నిర్వహిస్తున్న 'సిద్ధం' సభలకు అత్యధిక సమయం వెచ్చిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అది పూర్తిగా పార్టీ కార్యక్రమమే అయినప్పటికీ... ఆయా శాఖల యంత్రాంగాన్ని భాగస్వాముల్ని చేసి వారి సమక్షంలో ఏర్పాట్లు చేయించడం ప్రభుత్వ తీరును వేలెత్తి చూపుతోంది. అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏర్పాట్లలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల ముంగిట 'సిద్ధం' పేరుతో వైకాపా ప్రాంతాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడులో మూడు సభలు జరగ్గా.... ఈనెల 10న బాపట్ల జిల్లాలో చివరి సభ జరగనుంది. అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్‌ సభలకు హాజరవుతున్నారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో సభకు... యంత్రాంగం దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తుంది. ఐదు రోజులుగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పార్టీ తరపున నిర్వహించే సభకు... పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారుల కనుసన్నల్లో ఏర్పాట్లు జరగటం విస్మయానికి గురిచేస్తోంది. రాత్రీపగలు అనే తేడా లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. బాపట్ల నుంచి ఏఆర్‌ విభాగానికి చెందిన పోలీసులను.. సభ ప్రాంగణంలోనే ఉంచి బారికేడ్లు, ఇతర సామాగ్రి చోరీ కాకుండా విధుల్లో ఉంచుతున్నారు.

హెలిప్యాడ్‌ వద్ద ఇంకా పనులు కొలిక్కిరాలేదు. అయినా అక్కడ ప్రతి మూడు గంటలకు ఒకరు చొప్పున ఏఆర్‌ కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేలా డ్యూటీలు వేశారు. ప్రధాన వేదిక వద్ద సైతం ఐదుగురు కానిస్టేబుళ్లు షిప్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. సభ నిర్వహణ ప్రదేశం కొరిశపాడు మండల పరిధిలోకి వస్తుంది. సంబంధిత మండల తహశీల్దార్‌ మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... నిత్యం ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు వీఆర్‌ఏలను అక్కడకు పంపుతున్నారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ సహా చీరాల, బాపట్ల సబ్‌డివిజన్లకు చెందిన డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు సభా ప్రాంగణానికి వచ్చిపోతున్నారు.

మొత్తానికి అధికార యంత్రాంగమంతా వైకాపా నిర్వహించే సభ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. సహజంగా పోలీసులు ఒకటి, రెండు రోజులు ముందుగా సభ నిర్వహించే ప్రదేశానికి చేరుకుని... బందోబస్తు విధులకు చర్యలు తీసుకోవాలి. అలాంటిది ఏర్పాట్ల దశ నుంచే పోలీసులకు డ్యూటీలు వేసి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. వీరంతా విధుల్లో ఉన్నారా లేదా అని ఉన్నతాధికారులు మాటిమాటికీ వస్తూ కిందిస్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story