రేషన్ సరుకుల ధరలను పెంచనున్న జగన్ ప్రభుత్వం!

రేషన్ సరుకుల ధరలను పెంచనున్న జగన్ ప్రభుత్వం!

రేషన్ సరుకుల ధరలను వైసీపీ ప్రభుత్వం మరోసారి పెంచనుంది. నాలుగు నెలల కిందటే ధరల పెంపునకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే కేంద్రం ఉచిత రేషన్ పంపిణీ గడువును పొడిగించడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో డిసెంబర్ ఒకటి నుంచి ధరల మోత మోగించనుంది. ఇప్పటికే కిలో పంచదారపై 14 రూపాయలు పెంచగా.. ఇప్పుడు కందిపప్పుపై 27 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కూడా స్వీకరిస్తోంది.

కొన్ని సంవత్సరాలుగా కందిపప్పు కిలో 40 రూపాయలకే ఇస్తుండగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకేసారి 27 రూపాయలకు పెంచేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో ధర 100 రూపాయలపైన ఉంది. కానీ నాలుగు నెలల కిందట 80 రూపాయలు ధర ఉన్నప్పుడే పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంచదార ధరను 10 రూపాయల నుంచి 17 రూపాయలు చేసింది. ఈ పెంపు వల్ల నెలకు కందిపప్పుపై 40 కోట్లు, పంచదారపై 10 కోట్లు ప్రజలపై భారం పడనుంది. అంటే ఏడాదికి 600 కోట్ల రూపాయల అన్నమాట.

అన్నిటికీ మించి పేదలపై మరింత భారం మోపే మరో నిర్ణయం వైసీపీ సర్కార్ తీసుకుంది. రేషన్ సరుకులపై రాయితీని 25శాతం మించకూడదని నిశ్చయించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో 80 రూపాయలు ఉన్నా రేషన్ దుకాణాల్లో 50శాతం రాయితీతో 40 రూపాయలకే ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 25శాతం మాత్రమే రాయితీ ఇస్తోంది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శిస్తున్నాయి.

అసలే కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సిందిపోయి.. రేషన్ సరుకుల ధరలు పెంచాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story