AP: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నీటి ప్రాజెక్టులకు ఆమోదముద్ర
వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల సృష్టికి సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని నీటిపథకాల అభివృద్ధి కోసం భారీగా రూ.9,514 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. త్రాగునీరు, సాగునీరు విభాగాల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమల విస్తరణలో భాగంగా, ప్రముఖ విరూపాక్ష ఆర్గానిక్స్ సంస్థకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో పెట్టుబడులకు వేగం చేరేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటు నేపథ్యంలో సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలును ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతి రాజధానిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరయ్యాయి. రాజధాని నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇవి కీలక ముందడుగులుగా భావిస్తున్నారు. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధికి ఇది పెద్ద ఊతమివ్వనుంది. కుప్పం నియోజకవర్గంలో పాలర్ నదిపై నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించి సవరించిన అనుమతులకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.
కీలక నిర్ణయాలు ఇవే..
* సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు కేబినెట్ ఆమోదం.
* కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఓకే
* గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి గ్రీన్ సిగ్నల్
* ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చ, ఆమోదం
* ఎస్ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
* రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
* రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఉపాధ్యాయ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం ప్రకారం, 417 మంది భాషా పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూళ్లలో భాషా బోధన నాణ్యత మరింత మెరుగుపడనున్నదని విద్యాశాఖ భావిస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, నీటి వనరులు, విద్య తదితర రంగాల్లో వేగవంతమైన పురోగతికి దోహదం చేయనున్నాయి. విశాఖపట్నంలో రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడంపై కూడా సీఎం చర్చించారని సమాచారం. అందుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని.. దాని నివేదికపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ, దేవాదాయ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రెవెన్యూ అనుబంధ సమస్యలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. వాటి పరిష్కారానికి నిర్ణీత వ్యవధిని పెట్టుకొని పనిచేయాలని సీఎం సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

