Kodi Kathi Case: కోడికత్తి శ్రీనుకు బెయిల్..

కోడికత్తి కేసులో ఐదేళ్లుగా రిమాండ్‌లో ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు (Janipalli Srinivasa Rao) బెయిల్ మంజూరైంది. అతడికి హైకోర్టు (High Court) బెయిల్ మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తితో దాడి కేసు దర్యాప్తు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నంకు గత ఏడాది ఆగష్టలో బదిలీ అయ్యింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై దాడి జరిగింది. 2023 వరకు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాల్సిందిగా పలుమార్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినా రకరకాల కారణాలతో హాజరుకాలేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ NIA ) గత ఏడాది కోర్టు విచారణలో స్పష్టం చేసింది. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు కూడా ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది. అయితే జగన్ పున్వరిచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో ఈ కేసులోని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది.
ఎన్‌ఐఏ కోర్టు విచారణలో చార్జ్ షీట్, కౌంటర్‌తో పాటు ఈ-స్టేట్‍మెంట్‍ను ఎన్ఐఏ జతచేసింది. ఇందులో శ్రీనివాసరావు కీలక విషయాలను పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని... జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని పేర్కొన్నాడు. ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై అటాక్ చేశానని తెలిపారు మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించినట్లు విచారణలో నిందితుడు పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com