Pattabhi : పట్టాభి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

Pattabhi : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. ఆయన అరెస్ట్ వ్యవహారంపై నిన్న హైకోర్టులో న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు ముందు ఉంచిన 41ఏ నోటీసుల విషయంలో... మేజిస్ట్రేట్ సంతృప్తి చెందకపోయినా... రిమాండ్‌కు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది.
పట్టాభి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలిచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.... బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు.
అటు టీడీపీ నాయకుడు పట్టాభిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడలోని మూడో ఏసీఎంఎం కోర్టులో గవర్నరుపేట పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పట్టాభికి నోటీసులు జారీచేయాలని ఆదేశించిన న్యాయమూర్తి , విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు.
పట్టాభిని శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టాభిపై రాష్ట్ర ప్రభుత్వం 5 కేసులు నమోదు చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో తొలుత ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగటివ్ రిపోర్ట్‌తో...శుక్రవారం ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలతో ప్రత్యేక వాహనంలో పట్టాభిని రాజమహేంద్రవరానికి తరలించారు.
నేరుగా జైలు ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడి అధికారులకు పట్టాభిని అప్పగించారు. పట్టాభిని జైలులో రిమాండ్ బ్లాక్‌కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com