SKILL CASE: ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వాదనలు

SKILL CASE: ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వాదనలు
ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు.. అదనపు షరతులు విధించాలన్న సీఐడీ పిటిషన్‌పై వాదనలు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతులు విధించాలన్న ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అభ్యర్థన ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాది ఆక్షేపించారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించలేదని అభిమాన నాయకుడ్ని చూసేందుకు ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడటం ర్యాలీ పరిధిలోకి రాదనిస్పష్టం చే శారు. CID అనుబంధ పిటిషన్‌ను కాట్టేయాలని కోరగా నిర్ణయాన్ని రేపు (శుక్రవారం) వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రకటించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబకు.. అనారోగ్య కారణాల రీత్యా మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని ఏపీ CID దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. CID తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చంద్రబాబు.. రాజమండ్రి జైలు బయట పత్రికా సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ఆ వివరాల్ని పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు సమర్పించామన్నారు. చంద్రబాబు కార్యకలాపాలను పరిశీలించేందుకు ఇద్దరు DSPస్థాయి అధికారులు చంద్రబాబు వెంట ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిలు ఇచ్చిన నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా షరతు విధించాలన్నారు.


ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వం వద్ద నిఘా విభాగం ఉంది కదా, ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సమాచారం సేకరణ కోసం కోర్టు ఉత్తర్వుల అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ వాదనలపై చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుపై అదనపు షరతులు విధించాలని కోరడం వెనుక ఇతర కారణాలున్నాయన్నారు. నేర నిరూపణై, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకూ ప్రాథమిక హక్కులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.. జైల్లో ఉన్న ఖైదీలు మీడియాతో మాట్లాడేందుకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. స్కిల్‌ కేసులో మీడియాతో మాట్లాడొద్దని పిటిషనర్‌కు హైకోర్టు ఇప్పటికే షరతు విధించిందని గుర్తుచేశారు. రాజకీయ ర్యాలీల్లో పాల్గొనద్దనే షరతు విధించాల్సిన అవసరం, లేదన్నారు. ప్రస్తుతం ర్యాలీల్లో పాల్గొనే పరిస్థితి లేదని, ఆరోగ్యం కుదుటపడినప్పుడు పిటిషనర్‌ తన హక్కును న్యాయస్థానం ద్వారా పొందుతారని దమ్మాలపాటి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించలేదన్నారు. అభిమాన నాయకుడ్ని చూసేందుకు... ప్రజలు రోడ్లకు ఇరువైపుల నిలబడటం ర్యాలీ పరిధిలోకి రాదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి రిజర్వ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story