Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు

Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
X
అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా.. అని ప్రశ్నించిన ధర్మాసనం

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహరంలో ఇటీవలే ఆయనపై అనంతపురం నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీలు లేదని కోర్టు తెలిపింది.

కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

విచారణ సందర్భంగా పిటిషనర్ బోరుగడ్డ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, పిటిషనర్‌ అనిల్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఇప్పటికే రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ సైతం దాఖలు అయ్యిందని హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపారు. ఈ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బోరుగడ్డ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.

వైసీపీ పాలనలో రెచ్చిపోయిన బోరుగడ్డ

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతనివైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్‌.. కేంద్రమంత్రిగా పని చేసిన రాందాస్‌ అథవాలె అనుచరుడిగా చెప్పుకొంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఏపీ అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. జగన్‌ను అన్నా అని సంబోధిస్తూ తానూ పులివెందులకు చెందినవాడినేనంటూ వైకాపాతో అంటకాగాడు. జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై సభ్యసమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Tags

Next Story