AP: కేసులు పెట్టడంలో తప్పేముంది: హైకోర్టు

AP: కేసులు పెట్టడంలో తప్పేముంది: హైకోర్టు
X
అసభ్యకర పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏపీ సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది.చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం

సోషల్ మీడియా పోస్టులుపై పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై.. పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటోంది. వరుసగా కేసులు నమోదు చేస్తూ.. పలువుర్ని అరెస్ట్ చేసింది. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉన్నారు. అంతేకాదు పలువురు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌లపైనా కేసులు నమోదయ్యాయి. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, పోసాని వంటి వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు .

వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: హోంమంత్రి

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారాని ఇది సహించే విషయం కాదని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని... ఆ తర్వాత పోస్టులు డిలీట్‌ చేశారని అన్నారు. అయినా, వారిని వదిలిపెట్టబోమని... కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని... సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్‌ ఏంచేయలేకపోయారని అన్నారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేం అరెస్టులు చేస్తున్నామని హోం మంత్రి తెలిపారు.

Tags

Next Story