AP: చట్టరీత్యా నేరమైతే.. సోషల్ మీడియాలోనూ నేరమే
సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిలువరించాలంటూ.. పాత్రికేయుడు, వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలా విజయబాబు వ్యాజ్యం వేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ, ఖర్చుల కింద విజయబాబు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికగా అవతలి వ్యక్తులపై చేస్తున్న వ్యవస్థీకృత విష ప్రచార దాడులు తీవ్ర నష్టం కలిగిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. దూషణలతో కూడిన అసభ్య పోస్టులు పెట్టే వారిని సామాజిక మాధ్యమ ఉద్యమకారులని చెప్పలేమని తేల్చి చెప్పింది. నచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులకు సోషల్ మీడియా వేదికలు ఎలాంటి రక్షణా ఇవ్వలేవంది. చట్టరీత్యా ఏదైతే నేరమో.. దాన్ని సోషల్ మీడియాలో చేసినా నేరమేనని తేల్చిచెప్పింది. అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, ముఖ్యంగా అవతలి వ్యక్తుల్ని అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించే కిరాయిమూకల విషయంలో కఠినంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసంది.
వ్యత్యాసం ఉందన్న హైకోర్టు
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభిప్రాయాలను వ్యక్తంచేసే వారికి... మర్యాద లేకుండా, అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తులపై దాడికి దిగేవారికి మధ్య వ్యత్యాసం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి కులమతాలు, సమూహాల మధ్య విద్వేషాలు రేకెత్తించి సమాజంలో అశాంతిని కలిగించే అవకాశం లేకపోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలోని అట్టడుగు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల హక్కులను కాపాడేందుకు పిటిషనర్ ఈ పిల్‌ను దాఖలు చేయలేదంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఉద్యమకారుల హక్కుల కోసం వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపింది. ఈ ఉద్యమకారులను బలహీనవర్గమని కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గమని కానీ చెప్పలేమంది. పోలీసు చర్యలపై అభ్యంతరం ఉంటే... పోస్టులు పెట్టినవారే చట్ట నిబంధనల మేరకు స్వయంగా పోరాడాలి తప్ప.. వారి తరఫున మరొకరు పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
విచారణార్హత ఉంటుందా?
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభిప్రాయాలను పోస్టు చేసేవారికి వారి హక్కుల గురించి పూర్తి అవగాహన ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలో ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసని... అధికారంలో ఉన్నవారి లోటుపాట్లను విమర్శించే సామర్థ్యం వారికి ఉంటుందన్నారు. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరం ఉంటే చట్ట ప్రకారం సవాలు చేసుకునే సామర్థ్యం ఉన్న సోషల్ మీడియా సమూహం తరఫున దాఖలు చేసిన ప్రస్తుత పిల్‌కు ఏవిధంగా విచారణార్హత ఉంటుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు ముందున్న రికార్డులను పరిశీలిస్తే... ప్రస్తుత పిల్ రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసినట్లు కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com