Kondapalli : రేపు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం
AP High Court (tv5news.in)
Kondapalli : కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. తెలుగుదేశం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం...ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు రక్షణలో మున్సిపల్ ఎన్నిక నిర్వహించాలని సూచించింది. ఎన్నిక తర్వాత ఫలితాలు ప్రకటించొద్దని ఆర్డర్ జారీ చేసింది. గురువారం ఎన్నిక వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలంటూ విజయవాడ సీపీని ఆదేశించింది. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీకి సూచించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
ఇవాళ ఉదయం కొండపల్లి మున్సిపల్ ఆఫీసు దగ్గర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్స్ అఫిషియో సభ్యులతో సహా వైసీపీ, తెలుగుదేశం కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. బల్లలు చరుస్తూ వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఆఫీసు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎన్నికను ఆపేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ ఆరోపించింది. గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రిటర్నింగ్ ఆఫీసర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉందన్నారు.
ఐతే దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలుగుదేశం. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు....అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ సీపీని కోర్టుకు రావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన అధికారులు ఎన్నిక వాయిదా పడిన తీరును వివరించారు. తర్వాత బుధవారం కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com