AP High Court: పంచ్ ప్రభాకర్‌ను పది రోజుల్లో అరెస్టు చేయాలి: ఏపీ హైకోర్టు

AP High Court (tv5news.in)
AP High Court: న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను పదిరోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి తుది గడువు ఇచ్చింది ఏపీ హైకోర్టు. దర్యాప్తు సరైన రీతిలో సాగుతోందని సదుద్దేశాన్ని రుజువు చేసుకోవాలని తెలిపింది. ఇందులో విఫలమైతే సీబీఐకి దర్యాప్తు చేతకావడం లేదని భావించి సీట్ ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ నివేదిస్తామని వెల్లడించింది. దర్యాప్తుపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
అసభ్యకర పోస్టులపై అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ దాఖలుచేసిన వ్యాజ్యంపై మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఆయన వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానాన్ని అపకీర్తిపాలు చేసే పోస్టులపై పోలీసులు కేసు నమోదుచేశాక.. సామాజిక మాధ్యమాలు చేయాల్సిన మొదటి పని ఆ పోస్టులను తొలగించడం కాదా? అని ప్రశ్నించింది.
పోస్టులు పెట్టిన వ్యక్తి ఉద్దేశం నెరవేరాక ఒకటి, రెండేళ్ల తర్వాత వాటిని తొలగించి ఉపయోగం ఏముంటుందని వ్యాఖ్యానించింది. సీబీఐ తరఫున పి.సుభాష్ వాదనలు వినిపిస్తూ.. వీడియోలు తొలగించాలని గూగుల్‌కు లేఖలు రాయగా.. ఆ పోస్టులు పెట్టిన నిందితులనే తొలగించాలని బతిమాలుకోవాలంటూ సమాధానం వచ్చిందన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేశామన్నారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.
దీంతో సీబీఐపై ఆగ్రహం వ్యక్తంచేసిన ధర్మాసనం..'మిమ్మల్ని ఎవరు బతిమాలమన్నారు? చేతకాకపోతే చెప్పండి.. సిట్‌ను ఏర్పాటుచేస్తామని సీబీఐని హెచ్చరించింది. 4 వారాల సమయం ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ విమలాదిత్య కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభాకర్‌ను పట్టుకోవడానికి మూడు రోజులే ఇస్తామని, లేనిపక్షంలో సీడీఐ డైరెక్టర్ హాజరుకావాలని హెచ్చరించింది. మరికొంత సమయమివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ వేడుకొనగా.. పది రోజుల సమయం ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com