Eluri Sambasiva Rao: ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.

Eluri Sambasiva Rao: ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.
పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.

ఇలాంటి కేసుల్లో సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సాంబశివరావును అరెస్ట్ చేస్తే బాధ్యులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించని అధికారులను లోపలకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యనించింది. ఈ క్రమంలో వివరాలు అందించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

‘గ్రానైట్‌ కంపెనీల్లో తనిఖీలు చేయకుండా విధులకు ఆటంకం కలిగించామనే ఆరోపణలతో మైనింగ్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(నిఘావిభాగం, నెల్లూరు) బాలాజీనాయక్‌ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు కంపెనీల యజమానులతో పాటు నాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా కేసు పెట్టారు. కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయి. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవే. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ)కింద నోటీసులు ఇవ్వాలి. కానీ, ఇవ్వలేదు. మరోవైపు, ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఈలోగానే నన్ను(పిటిషనర్‌) అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే అయినా మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా వారికి రిమాండ్‌ విధించారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తగా ఫామ్‌-7 దాఖలు చేసిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాతే ఓట్ల తొలగింపులో భాగస్వాములైన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొందరు పోలీసులను సైతం సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో నన్ను వేధించాలనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారు. నాపై నమోదైన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story