AP: వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: హోంమంత్రి

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారాని ఇది సహించే విషయం కాదని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని... ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేశారని అన్నారు. అయినా, వారిని వదిలిపెట్టబోమని... కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని... సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్ ఏంచేయలేకపోయారని అన్నారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేం అరెస్టులు చేస్తున్నామని హోం మంత్రి తెలిపారు.
సోషల్ సైకోలకు జగనే నాయకుడు
వైసీపీ సైతాన్ సోషల్ మీడియా సైన్యానికి వైఎస్ జగనే నాయకుడని, తనపై తప్పుడు ప్రచారం చేయించింది ఆయనేనని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.సైతాన్ సైన్యంలో విషపు నాగులతోపాటు అనకొండను కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పటికి గానీ సైకో సోషల్ మీడియా ఆగడాలు ఆగవని షర్మిల అన్నారు. సోషల్ మీడియాలో తానూ బాధితురాలినేనని షర్మిల అన్నారు. తనతోపాటు తల్లి విజయమ్మ, సోదరి సునీతను ఎలాఅంటే అలా మాట్లాడారన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని సోషల్ మీడియా సైతాన్లకు జగన్‌మోహన్‌రెడ్డే చెప్పారని వెల్లడించారు. పోస్ట్‌లు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవన్నారు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్ విసిరారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితికి తెచ్చారని షర్మిల అన్నారు.
ఆర్జీవీ మీద కేసు
గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ మీద కేసు నమోదైంది. ఏపీ తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేశారు . ఈ కేసులోనూ నోటీసులిచ్చే అవకాశం ఉంది. దేనిమీదైనా.. ట్విట్టర్‌లో తనదైన స్టయిల్‌గా రియాక్టవడం వర్మకు అలవాటు. కానీ.. ఏఐ వీడియోలతోనో, అమెరికా ఎన్నికల ఫలితాల మీదో టైమ్‌పాస్ చేస్తున్నారు తప్ప.. తనమీద నమోదౌతున్న కేసుల పరంపరపై వర్మ ఖాతాల్లో చిన్న ప్రస్తావనైనా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. జూనియర్ ఆర్టిస్ట్, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పీఎస్‌లో కంప్లయింట్ నమోదైంది. కూటమి నేతలపై ఆమె చేసిన సీరియస్ కామెంట్లను ఫిర్యాదులో జతపరిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com