AP: ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీ బాయ్‌కాట్

ఆంధ్రప్రదేశ్‌లో హోటల్స్ అసోసియేషన్... సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలివేశామని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు ప్రకటించారు. ఏపీలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన
స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందని హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది . ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న మూడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించామని... తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని.... కానీ, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందని మండిపడ్డారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయంపై చర్చించామన్నారు.. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు.. అయితే, స్విగ్గీ, జొమాటోకు సహకరించేందుకు తాము సిద్దంగానే ఉన్నట్లు ప్రకటించారు. కానీ, నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో మేం నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
10 నిమిషాల్లో స్విగ్గీ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘బోల్ట్’ పేరిట కేవలం 10నిమిషాల్లోనే వినియోగదారులకు ఫుడ్‌ను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరుల్లోని ఆరు నగరాల్లో ఈ సర్వీసులను ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com