AP: నిషేధిత జాబితాలో ఉన్నా... ఇంటిస్థలం అమ్ముకోవచ్చు

ఎసైన్డ్ ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, బదిలీలు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పదేళ్లు పూర్తైన ఎసైన్డ్ స్థలాల విషయంలో స్పష్టమైన నిబంధనలు తీసుకురావడంతో లబ్ధిదారులకు కొంత ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఇకపై కొన్ని నిర్దిష్ట పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, అదనపు అనుమతులు లేదా ధ్రువీకరణలు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎసైన్డ్ స్థలాల్లో నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ విడుదల చేశారు. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇంటి స్థలంగా కేటాయించిన భూమి విషయంలో సంబంధిత వ్యక్తి అధికారిక పట్టా లేదా అసైన్మెంట్ ఆర్డర్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆ స్థలంలో ఇల్లు నిర్మించినట్లు నిరూపించేందుకు సంబంధిత స్థానిక సంస్థ జారీ చేసిన ఇంటి పన్ను రసీదు లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాలి. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తి అసలు లబ్ధిదారుడే కావాలని, లేకపోతే చట్టబద్ధ వారసుడు అయి ఉండాలని స్పష్టం చేశారు.
వారసులైతే అసలు కేటాయింపుదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన అంశంగా ఇంటి స్థలం కేటాయించి పదేళ్లు పూర్తయితే, ఆ స్థలాన్ని అమ్ముకోవడం లేదా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్షన్ 22-ఎ కింద నిషేధిత జాబితాలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ అధికారులు కేవలం సర్వే నంబర్ ఆధారంగా మాత్రమే కాకుండా, నిర్దిష్ట ప్లాట్ నంబర్‌కు అనుగుణంగా ఉన్న సర్వే లేదా బ్లాక్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. కేటాయింపు జరిగి పదేళ్లు పూర్తయ్యాయా లేదా అనే అంశాన్ని కూడా రిజిస్ట్రేషన్ అధికారి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) లేదా ఇతర పథకాల కింద క్రమబద్ధీకరించిన ఆస్తుల విషయంలో కూడా అదనపు పత్రాలు అడగకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవి నిషేధిత జాబితాలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం కల్పించకూడదని సూచించింది. ఇంకా మార్గదర్శకాల్లో పేర్కొన్న పత్రాలు తప్పించి మరే ఇతర అదనపు పత్రాలను అధికారులు అడగరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఒకసారి ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దానిపై భవిష్యత్ లావాదేవీలను 90 రోజుల తర్వాత ఎలాంటి అదనపు ధ్రువీకరణలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
