AP: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో గురువారం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. వర్షాల ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని 10 ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
డిప్యూటీ సీఎం కీలక సూచనలు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్ని మాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలుపంచుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోతే వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com