AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జాతర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు-2025ను కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. నేడు, రేపు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా ఈ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది. విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభానికి ముందే లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తరలివస్తున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒక్క రోజు ముందుగానే 35 సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. మొత్తం రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు చకాచకా జరిగిపోతున్నాయి. వీటి ద్వారా ఏకంగా 1.26 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇవాళ(గురువారం) ఉదయం నుంచి ఇప్పటివరకూ 6 సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంవోయూలు జరిగాయి.
సీఎంతో తైవాన్ బృందం భేటీ..
పెట్టుబడుల సదస్సులో భాగంగా విశాఖకు వచ్చిన తైవాన్ బృందం సీఎంతో భేటీ అయింది. తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని బృందం చంద్రబాబును కలిసింది. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని తైవాన్ బృందానికి సీఎం తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పని చేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని సీఎంకు వెల్లడించింది.
పెట్టుబడుల ప్రవాహం..
రెన్యూ పవర్ రూ.60 వేల కోట్లు, eJoule రూ.19,000 కోట్లు, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్ రూ.1,200 కోట్లు, కోరమాండల్ రూ.2,000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీ రూ.15,000 కోట్లు, JOOL రూ.1,500 కోట్లు పెట్టుబడులపై ఇప్పటివరకూ ఒప్పందాలు జరిగాయి. మరో 29 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒప్పందాలు చేసుకోనుంది. ఏపీ సీఆర్డీఏ 8 ఎంవోయూలు, ఇంధన రంగంలో 5, ఫుడ్ ప్రాసెసింగ్ 4, ఐ అండ్ ఐ 3, ఇండస్ట్రీస్‌లో 9 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోంది. కాగా, రెన్యూ పవర్ ఈ ఏడాది మేలోనే రూ.22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దీంతో ఈ ఒక్క సంస్థ పెట్టుబడులే రూ.82 వేల కోట్లకు చేరాయి.
రెన్యూ పవర్ సంస్థ ఎంవోయూ
గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇందులో భాగంగా.. ఇంధనరంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలను రెన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు కుదుర్చుకున్నారు. ఇవి కాకుండా...గతంలోనే రూ. 22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ సంస్థ ముందుకొచ్చింది. ఒప్పందంలో భాగంగా 6 GW PV ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

