AP: ఐపీఎస్ పీవీ సునీల్ సస్పెన్షన్ పొడిగింపు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అభియోగాలు నిరూపణ కావడంతో సునీల్‌కుమార్‌ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో రివ్యూ కమిటీ సమీక్ష నిర్వహించింది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగంపై సునీల్‌కుమార్‌పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గతంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులోనూ గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యాధారాలు, దర్యాప్తును ప్రభావితం చేస్తారని రివ్యూ కమిటీ నివేదించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సస్పెన్షన్ పొడిగించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సస్పెన్షన్ ఆదేశాలను పొడిగిస్తూ సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పాలనలో సునీల్ పేట్రేగిపోయారు.
ఐపీఎస్ సంజయ్‌కు 14 రోజుల రిమాండ్
ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన కోర్టు ముందు హాజరుకాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్‌ను విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా పనిచేసినప్పుడు ఈ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించే కార్యక్రమాల కోసం ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై రూ.1.19 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మంది రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, మరో 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, ఇద్దరిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com