AP: డ్రోన్ల తయారీ కేంద్రంగా "ఆంధ్రప్రదేశ్"

డ్రోన్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ అత్యత్తమ కేంద్రంగా రూపొందించేలా కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొదటి, అతి పెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ఏపీలో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా డ్రోన్ తయారీ, సేవలు, యాక్సిల్లరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు 100 మందికిపైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో డ్రోన్స్ రంగాన్ని అభివృద్ధి చేసి ఏపీని దేశానికే డ్రోన్స్ క్యాపిటల్‌గా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని దినేష్ కుమార్ వివరించారు.
అందరికీ ప్రోత్సాహం
ఏపీలో డ్రోన్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రోత్సహకాలు కల్పిస్తోందని దినేష్ కుమార్ చెప్పారు. ఓర్వకల్లుతో పాటు రాష్ట్రంలో పెట్టుబడిదారులు తమకు నచ్చిన జిల్లాల్లో కూడా డ్రోన్ పరిశ్రమలు నెలకొల్పవచ్చని, వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తుందన్నారు. డ్రోన్ రంగంలో ప్రపంచ దేశాలైనా చైనా, బెల్జియం, అమెరికా లాంటి వాటికి ధీటుగా ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
టెక్కలిలోనూ..
డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రకు నెల్లిమర్ల మండలం టెక్కలిలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రంగా మారబోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇప్పటికే ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సాగు వ్యయాన్ని తగ్గించేందుకు వీటి వినియోగం పెరగాలన్నారు. ప్రధాని మోదీ డ్రోన్ల వాడకాన్ని పెంచేందుకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారేలా తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com