ap: ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం ప్రతిపాదించామన్నారు. అయితే, గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా పక్కన పెట్టిందని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కు మెట్రో రైలు నిర్మాణమే పరిష్కారమని స్పష్టం చేశారు. కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం, మిగిలిన 60 శాతం అతి తక్కువ వడ్డీ లోన్ ద్వారా కేంద్రం నుంచి అందనున్నదన్నారు. ఈ లోన్‌కు ఈఎంఐలను మెట్రో కార్పొరేషన్ చెల్లించనుంది నారాయణ వెల్లడించారు.
విశాఖ మెట్రో ఫేజ్ 1..46 కిలోమీటర్లు
విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23 కిలోమీటర్ల మార్గానికి రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు. వీఎంఆర్డీఏ 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని నారాయణ వెల్లడించారు. మరోవైపు, విజయవాడ మెట్రో ఫేజ్-1 కింద 35.04 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతామని, రూ.10,118 కోట్లతో అమలు చేయనున్నట్టు నారాయణ తెలిపారు. సీఆర్డీఏ 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధులు సమీకరిస్తామన్నారు. విజయవాడ మెట్రోకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అయితే, విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 99.75 ఎకరాలు, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం 91 ఎకరాలు అవసరమవుతాయని, భూ సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు మంత్రి నారాయణ.. ప్రజలకు అత్యాధునిక రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
విజయవాడ మెట్రో: రూ.10,118 కోట్లు
విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రూ.10,118 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన నిధులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున CRDA నుంచి రూ.3,497 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది.
వైజాగ్ మెట్రో: రూ.11,498 కోట్లు
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఇందులో రాష్ట్ర వాటా కింద VMRDA నుంచి రూ.4,101 కోట్లు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్, మహారాణిపేట, శీలానగర్ వరకూ మెట్రో విస్తరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com