AP: ఏపీ మద్యం కుంభకోణం.. వెలుగులోకి సంచలన వీడియో

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం బయటపడింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఇది వరకే హైదరాబాద్‌లో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను గుర్తించారు. ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్ లో డబ్బులు దాచి ఉంచిన వీడియో సిట్‌కు లభ్యమైంది. పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు ఉన్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అట్టపెట్టెల్లో పేర్చేందుకు వీలుగా నోట్ల కట్టలను సిద్ధంగా ఉంచినట్లుంది. ఈ కేసు దర్యాప్తులో వెంకటేశ్ నాయుడి వీడియో ఆధారాలు కీలకంగా మారాయి. దీంతో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి ముఠా అడ్డంగా దొరికినట్లయింది. మద్యం వ్యాపారంతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. విచారణ సమయంలో వెంకటేశ్ నాయుడి వాట్సాప్ నుంచి సిట్ ఆ వీడియోను రిట్రీవ్ చేసింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదువున్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరిట దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. అతడినుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంతో.. లిక్కర్ స్కామ్‌కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్నిచోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశముంది. వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపైనా సిట్‌కు కీలక సమాచారం లభ్యమైనట్టు సమాచారం. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్రను సిట్ బహిర్గతం చేసే అవకాశముందన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com