AP: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి

AP: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి
X
ప్రశాంతంగా ముగిసిన దుకాణాల కేటాయింపు.. మహిళలకు 10 శాతం మద్యం దుకాణాలు

ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు సాగింది. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేట్ మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాగా.. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు మొత్తం 76 వేల దరఖాస్తులు వచ్చాయి.

మహిళలకు కూడా..

మొత్తం 3,396 మద్యం దుకాణాలకు గాను 345 మహిళలే దక్కించుకున్నారు. మొత్తంగా 10.20 శాతం దుకాణాలు వారికే లభించాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున మహిళలకే లభించాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఏపీలోని అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మూడు దుకాణాల లైసెన్సులు లాటరీలో తెలంగాణ వారినే వరించడం విశేషం. 96వ నంబరు దుకాణం ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కగా... 97వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ నంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు లభించాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు 121వ నంబరు దుకాణానికి 108 దరఖాస్తులు రాగా.. విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడు మండలానికి చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకున్నారు. వీరందరికీ తెలంగాణలో మద్యం వ్యాపారాలున్నాయి.

మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేస్తే..

మొన్నటి ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం దుకాణాలకు 100 దరఖాస్తులు వేశారు. వారికి మొత్తంగా మూడు దుకాణాలు లభించాయి. ఒక్కో దుకాణాన్ని ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది నిర్వహించుకునేందుకు వీలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ లైసెన్సులు అప్పగించేశారు.

Tags

Next Story