తనదైన శైలిలో సుదీర్ఘంగా అన్ని అంశాలను లేఖలో పేర్కొన్న నిమ్మగడ్డ రమేష్

తనదైన శైలిలో సుదీర్ఘంగా అన్ని అంశాలను లేఖలో పేర్కొన్న నిమ్మగడ్డ రమేష్

ఎన్నికలు ముందా..? వ్యాక్సినేషన్ ముందా..? అంటే రెండూ దేనికదే కొనసాగుతాయని స్పష్టం చేస్తోంది SEC. కరోనా వ్యాక్సినేషన్ సాగుగా చూపించి ఎన్నికలు వాయిదా వేయించాలని చూస్తున్న ప్రభుత్వానికి ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్తోంది. ఆ మాటకొస్తే మొదటి విడతలో టీకా ఇచ్చే ప్రాధాన్య విభాగాల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిని కూడా చేర్చాలని SEC సూచించింది. తద్వారా ఈ విషయంపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా అక్కడ వారు చూపించాలనుకుంటున్న అభ్యంతరాలకు ముందుగానే సమాధానం చెప్పినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని SEC తన లేఖలో పేర్కొన్నట్టు అర్థమవుతోంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా, ఇవాళ్టి నుంచి కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసినా.. ప్రభుత్వం నుంచి SECకి సహాయ నిరాకరణే ఎదురవుతోంది. నిన్న CS ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌తో చర్చల తర్వాత SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ 8 పేజీలతో ప్రొడీసింగ్స్ విడుదల చేశారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని విషయం తెలిసిన నేపథ్యంలో.. తక్షణం పోలింగ్ ఎందుకు నిర్వహించాలో ఆయన వివరించారు. టీకా పంపిణీ పూర్తయ్యేవరకు ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం వెనుక ఉద్దేశం ఎన్నికలను వాయిదా వేయించడమే అనే అభిప్రాయాన్ని కూడా SEC వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల నిర్వహణకు గట్టిగా పట్టుబట్టడం, ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకించడాన్ని కూడా నిమ్మగడ్డ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం ఆదేశాల ప్రకారం తొలిదశ టీకా ఇవ్వాల్సిన కేటగిరీ-1, కేటగిరీ-2లో ఉన్న వారు 3 లక్షల 7 వేల నుంచి 7 లక్షల మందే ఉన్నారని, ఈ నేపథ్యంలో టీకాల ప్రక్రియ ఎన్నికల నిర్వహణకు అడ్డు కాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు తనదైన శైలిలో వివరణ ఇస్తూ.. సుదీర్ఘంగా అన్ని అంశాలను లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. టీకాలు, కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికలను ముందు అనుకున్న తేదీ కంటే ముందుకు జరిపామని వివరించారు. అలాగే ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన పీపీఈ సూట్‌లు, ఫేస్‌షీల్డులు, గ్లోవ్‌లు, డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌లు ఇవ్వాలని కోరారు. మొదటి విడతలో టీకా ఇచ్చే ప్రాధాన్య విభాగాల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందినీ చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ సోకిన ఓటర్లకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని అందుకోసం పోలింగ్‌ సమయం పొడిగిస్తామని కూడా SEC చెప్పారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు తీర్పునకు కట్టుబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. గతంలోలా హింస చెలరేందుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రభుత్వం, పోలీసుశాఖ పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని కూడా నిమ్మగడ్డ అన్నారు.

CS ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో భేటీ తర్వాత నిమ్మగడ్డ రాసిన లేఖలో పేర్కొన్న మరో అంశం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలోని ఓ సీనియర్ ప్రతినిధి తిరుపతి ఉపఎన్నికల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని.. ఏప్రిల్, మే మాసాల్లో జరగవచ్చని వ్యాఖ్యలు చేశారని లేఖలో గుర్తుచేశారు SEC. ఈ తరహా వ్యాఖ్యలు కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. ప్రస్తుత కమిషనర్ పదవి విరమణ అనంతరం అంటే మార్చి తర్వాత ఎన్నికలు జరుగుతాయని కూడా ప్రచారం చేస్తున్నారని ప్రస్తావించారు. ఈ తరహా సమాధానమే పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి కూడా వ్యక్తం కావడం శోచనీయమని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రజా ప్రయోజనాల ప్రకారమే వ్యవహరిస్తుందని అందుకే ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story