AP: త్వరలో మోగనున్న స్థానిక ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మళ్లీ రాజకీయం మధ్యకెక్కుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై వేగంగా అడుగులు వేస్తుండగా, అధికార కూటమిలో మాత్రం సీట్ల పంపిణీపై అంతర్గత చర్చలు ముదురుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సంస్థలు, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలు కేవలం పరిపాలనా ప్రక్రియగా కాకుండా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు పరీక్షగా మారనున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన తాజా సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్ల పురోగతిని అధికారులు కమిషన్‌కు వివరించారు. ఎన్నికల ప్రక్రియను గడువులోపు పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ప్రత్యేకంగా ఓటరు జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రీ-ఎలక్షన్ పనుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు వేగవంతం చేయాలని అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి దశను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు ప్రారంభించడంతో రాజకీయ పార్టీల్లో కూడా ఎన్నికల చర్చ మళ్లీ చురుగ్గా సాగుతోంది. అయితే ఎన్నికల నిర్వహణ పరంగా అధికార కూటమికి పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఘన విజయం సాధించినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ప్రధాన సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయి రాజకీయాల్లో ప్రతి సీటు ప్రతిష్ఠాత్మకంగా మారుతుండటంతో కూటమి పార్టీల మధ్య పోటీ పెరుగుతోంది.
పట్టు బిగించేందుకు పార్టీలు సిద్ధం
జనసేన, బీజేపీలు ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశాల కోసం పట్టుబట్టే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయానికి తమ పాత్ర కీలకమైందని భావిస్తున్న ఆ రెండు పార్టీలు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా తగిన ప్రాధాన్యం కావాలని కోరుతున్నాయి. ముఖ్యంగా జనసేన నాయకత్వం గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని చాటుకునేందుకు ఈ ఎన్నికలను కీలక అవకాశంగా చూస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గౌరవప్రదమైన వాటా కావాలని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను రాష్ట్రంలో తన సంస్థాగత బలం పెంచుకునే అవకాశంగా భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్థాయిలో తన ప్రభావాన్ని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీ సున్నిత అంశంగా మారుతోంది. గత ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టిన తమకే ఇప్పుడు అవకాశాలు తగ్గిపోతాయేమోనన్న ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
