AP; అమరావతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి మలేషియా ఓకే

ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో మలేషియా ప్రతినిధుల బృందంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు, పెట్టుబడులపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నట్లు మంత్రి మలేషియా ప్రతినిధులకు వివరించారు. దేశంలోనే టాప్ 5 రాజధాని నగరాల్లో అమరావతి ఒకటి అని.. ఆ దిశగానే నిర్మాణాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మలేషియా ప్రతినిధులకు వివరించారు మంత్రి నారాయణ. అమరావతి విజన్ పరిశీలించిన మలేషియా ప్రతినిధులు.. రాబోయే రెండేళ్లల్లో 6 వేల నుంచి 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మలేషియా ప్రతినిధులు సైతం స్వయంగా పరిశీలించారు .
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై 20 అజెండా అంశాలపై చర్చించింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. వరద ముప్పు దృష్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలిపారు. కంట్రోల్ రూమ్ సేవలతో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com