AP: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ ప్రకటించారు. ‘అర్చకులకు రూ.15వేల వేతనం ఇవ్వాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10కోట్ల మేర అదనపు భారం పడనుంది. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుంది’ అని మంత్రి ఆనం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల ఆదాయం దాటిన దేవాలయాల్లోని అర్చకులకు వేతనం పెంచుతున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఈ ఆలయాల్లో పనిచేసే పూజారులకు 15 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు, అర్చకులకు, వేద పండితులకు, వేదాధ్యయన విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతితో సహా ఎన్నికల ప్రణాళికలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక శాఖ దేవాదాయశాఖ మాత్రమేనని దేవదాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాలకు సంబంధించి, అర్చకులకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను తమ శాఖ అమలు చేయడంలో ముఖ్యమంత్రి సహకారం మరువలేనిదని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు.
ధూప దీప నైవేద్యాలకు కూడా..
అలాగే ప్రైవేట్ దేవాలయాలలో ధూప దీప నైవేద్యాలకు అందించే మొత్తాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. ఏపీలో సుమారుగా ఆరు వేల వరకూ ప్రైవేట్ దేవాలయాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీటికు నెలకు ఆరు వేల రూపాయలను ధూప దీప నైవేద్యాల కోసం అందించేవారు. తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని పది వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని పదివేలకు పెంచారు. తాజాగా ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com