AP: ఆంధ్రప్రదేశ్ మంత్రికి తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రి, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నాయకులు, యువత.. మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండ్‌కు ఎద్దులు ఒక్కసారిగా బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. దీంతో ముందుకు బోర్లా పడిన మంత్రిపై ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, పార్టీ నాయకులు ఎడ్లను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు.
ఘటన తర్వాత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి చేరుకొన్న మంత్రికి వైద్యులు చికిత్స అందించారు. విషయం తెలిసిన నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచందర్రావు మంత్రి నివాసానికి వచ్చి పరామర్శించగా.. పలువురు నేతలు ఫోన్ ద్వారా ఘటన వివరాలను తెలుసుకొని పరామర్శించారు . ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com