LOKESH: నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు(సోమవారం) విశాఖపట్నం కోర్టులో హాజరుకానున్నారు. తనపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై గతంలో ఆయన పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. దీనికి మంత్రి లోకేశ్ హాజరుకానున్నారని టీడీపీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇప్పటికే సాక్షి దినపత్రికపై నారా లోకేశ్ వేసిన పరువు నష్టం కేసు కీలక దశకు చేరకుంది. సాక్షి దినపత్రిక తరఫున మొత్తం ఐదుగురు లాయర్లు వాదిస్తుండగా, మొదటి న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22న `చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` హెడ్డింగ్‌తోకల్పితాలతో సాక్షి దినపత్రికలో అసత్య కథనం ప్రచురించారని లోకేశ్ ఈ కేసు దాఖలు చేశారు. ఆ కథనంలో పేర్కొన్న రోజుల్లో తాను విశాఖలోనే లేనన్నారు.
అసలేం జరిగిందంటే
2019 అక్టోబర్ 22న `చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` హెడ్డింగ్‌తో అసత్యాలు, కల్పితాలతో సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడినదని, ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే దీనిని ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. ఆ కథనంలో పేర్కొన్న రోజులలో తాను విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
నారా లోకేశ్ యువగళానికి రెండేళ్లు
జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. టీడీపీ యువ నేత నారా లోకేశ్ చేసిన యువగళం పాదయాత్రకు రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రజలను ఏకం చేసేందుకు.. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించేందుకు లోకేశ్ ఈ పాదయాత్రను వినియోగించుకున్నారు. పాదయాత్రలో లోకేశ్ ఇచ్చిన హామీలే ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాలుగా మారాయి. కూటమి విజయంలో లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com