LOKESH: ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించండి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అదేశించారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాలని లోకేశ్ ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు ఏర్పాటు చేయాలని.. మంచినీరు, టాయ్ లెట్స్ వంటివి పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని... అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అస్సెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
విద్యార్థులు ఎందుకు తగ్గారు
గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేసినా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారని నారా లోకేశ్ ప్రశ్నించారు. లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతామన్నారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు.
వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ
అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించినట్లు నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ పై కేపీఎంజీ ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపైనా సమాలోచనలు జరిపారు. వరదలు కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ను ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com