MINISTER: సాధారణ రైతు కాదు.. రాష్ట్ర మంత్రి

ఓ సామాన్య రైతులా పొలం పనులు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఓ సాధారణ రైతులా తన పొలానికి మందు పిచికారి చేస్తూ కనిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వరుస పండుగల సందర్భంగా కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లిన మంత్రి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచీ తనకు పొలం పనులు చేయడమంటే చాలా ఇష్టమని మంత్రి నిమ్మల వెల్లడించారు. అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడే వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశానన్నారు. పండగ సందర్భంగా తమ స్వగ్రామం వచ్చానని, ఇలా వచ్చినపుడు ఏవైనా పొలం పనులు ఉంటే తాను స్వయంగా చేస్తానని, ఈ పని చాలా తృప్తిని ఇస్తుందన్నారు. తాను తలచుకుంటే వంద మండి పని వాళ్ళను పెట్టి పొలం పనులు చేయించుకోగల స్థోమత ఉన్నా.. తానే బురదలోకి దిగి పొలం పనులు చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com