AP: వైఎస్సార్ జిల్లా పేరు మార్చండి

AP: వైఎస్సార్ జిల్లా పేరు మార్చండి
X
ముఖ్యమంత్రికి మంత్రి వినతి.. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన పలు ప్రభుత్వ పథకాల పేర్లను మార్చారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పేరు తెరపైకి వచ్చింది. వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప అని. ఆది మధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రమని లేఖలో సత్య కుమార్ పేర్కొన్నారు. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారని... ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేదని... రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్స్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధని లేఖలో పేర్కొన్నారు.


అవగాహన రాహిత్యం వల్లే...

గొప్ప చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న కడప పేరును గత ప్రభుత్వం అవగాహనరాహిత్యంతో వైయస్సార్ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని మంత్రి సత్య కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. దీంతో శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నా భయం చేత ఎవరూ తమ అభిప్రాయాలను బయటపెట్టలేదన్నారు. తాను గతంలో శాసనసభలో ఇదే విషయాన్ని ప్రస్తావించానని గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యమని.. కాబట్టి కడవ చారిత్రక నేపథ్యాన్ని, డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేడు వైయస్సార్ జిల్లాగా పిలవబడుతున్న ఈ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చవలసిందిగా మనవి చేస్తానని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్ పేర్కొన్నారు . ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

పటిష్టంగా ఆహార భద్రతా చట్టం

ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల్ని పటిష్టంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కేంద్రం విడుదల చేసిన రూ.79 కోట్లలోరూ.65 కోట్లను వినియోగించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో వెంటనే ఒప్పందం చేసుకుని రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించాలని ఆదేశించారు. పట్టణాల్లో తాగునీటి ప్రమాణాల్ని నిరంతరం పర్యవేక్షించడానికి తగు చర్యలు చేపట్టాలని, ఆరోగ్య రక్షణ అధికారుల సంఖ్యను పెంచి నిఘా పెట్టాలని సూచించారు.

Tags

Next Story