AP: భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతులకు త్వరలోనే కొత్త విధానం తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మున్సిపాలటీలు, పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలు ఉన్నాయని, త్వరగా చెల్లించాలని మంత్రి నారాయణ కోరారు.
అనుమతి రాగానే విశాఖ మెట్రో రైలు
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సిద్ధం చేశామని.. ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిసినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. రెండు ఫేజ్‌లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు.
మెగా సిటీ ఏర్పాటు చేస్తాం
విజయవాడ, మంగళగిరి, అమరావతి, గుంటూరు కలిపి మెగాసిటీగా మారతాయని నారాయణ అన్నారు. ఆ విధంగానే అమరావతి నిర్మాణ ప్రణాళికలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ ఆర్థికరంగం పురోగమనానికి స్థిరాస్తి రంగం చాలా కీలకమని అందుకే లే ఔట్ల అనుమతులు విషయంలో సడలింపులు తెస్తున్నామని నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకులకు డీడీల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తామని రాష్ట్రవెల్లడించిన సంగతి తెలిసిందే. గుత్తేదారులకు పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపులు, ఇతర విషయాలపై పరిశీలన చేసేందుకు చీఫ్ ఇంజినీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లుల విలువ రూ.540 కోట్ల వరకు ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com