AP: ఖాకీలనే వణికించిన నెల్లూరు కిలేడీ

ఒకప్పుడు ఆమె చిన్న బొటిక్ నిర్వహించుకునేవారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలు, అప్పట్లో జిల్లాలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలతో ఆ ఐదేళ్లలో అత్యంత ‘పవర్ఫుల్’గా తయారయ్యారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లను తన కనుసైగలతో శాసించేంతగా తయారై.. సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోయారు. డెన్లు ఏర్పాటుచేసుకుని రౌడీషీటర్లతో గ్యాంగ్‌లు నడిపించారు. గంజాయి స్మగ్లింగ్ చేయిస్తూ.. రూ.కోట్లు కూడబెట్టారు. తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ ఈ దందాలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ల పాటు వ్యూహాత్మక మౌనం పాటించిన ఆమె తాజాగా మళ్లీ పైరవీలు, దందాలు మొదలుపెట్టేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల పెరోల్ ఇప్పించటంలో ఆమెదే కీలకపాత్రని సమాచారం. . గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దల్ని కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంది. ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చుని.. ‘మీకు ఏమి కావాలో చెప్పండి. నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే. నేను చూసుకుంటా’ అంటూ సీఐలు, ఎస్ఐలనే కమాండ్ చేసే స్థాయికి చేరింది.
సచివాలయంలోనే...
రాష్ట్ర సచివాలయంలోనే కూర్చుని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతోంది. నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ అరుదు. తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి బదిలీ అయ్యారు. గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్పు వెళ్లింది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో ‘దిశ’తో ఎక్కడికో మారిపోయింది. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని, పోలీసు పరిచయాలు పెంచుకుని ఎదిగేందుకు ఎన్ని దారులుంటాయో అన్నీ ఎంచుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుుడు ఈ మహిళ ఆట కట్టించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com