AP New Cabinet: రాజీనామా చేసిన మంత్రులను పార్టీ పటిష్టత కోసం వినియోగించుకుంటాను: వైఎస్ జగన్

AP New Cabinet: ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో.. 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామా లేఖలను స్వీకరించిన జగన్... వాటిని రాజ్ భవన్ కు పంపారు. ఈ నెల 11 వ తేదీన కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. మొత్తం 40 అంశాలపై చర్చ జరిగిన సమావేశంలో.. అన్నింటికన్నా ప్రధానంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపైనే మంతనాలు జరిగాయి.
మంత్రిమండలి మార్పు విషయంలో తన అభిప్రాయాలను ముఖ్యమంత్రి స్పష్టంగా వెల్లడించారని.. సమావేశం అనంతరం మంత్రులు తెలిపారు. కొత్త మంత్రివర్గంలో కొందరికి మళ్లీ అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం నడిపే అనుభవం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ ఎంపిక ఉంటుందని సీఎం స్పష్టం చేసినట్లు మంత్రులు తెలిపారు. అలాగే రాజీనామా చేసిన మంత్రులను పార్టీ పటిష్టత కోసం వినియోగిస్తానని జగన్ చెప్పినట్లు.. కొడాలి నాని వెల్లడించారు.
మరోవైపు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అసలు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తొలగించిన మంత్రులకు ప్రాంతీయ మండళ్ల బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆగస్టు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసే ఛాన్సుంది. అలాగే మరికొందరికి జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించనున్నారు. తద్వారా తొలగించిన మంత్రులకు ప్రోటాకాల్ సమస్య తీరుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఇదే సమయంలో కొంతమంది మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. వారిని జగన్ ఓదార్చారని తెలుస్తోంది. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. మంత్రి పేర్ని నాని తెలిపారు. అటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం.. రాజీనామాలు సమర్పించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌కు అన్ని అంశాలపై అవగాహన ఉందని.. దాని ప్రకారమే ఆయన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని బొత్స చెప్పారు. మంత్రివర్గం రాజీనామా ప్రక్రియ పూర్తి కావడంతో.. ఇక ఇప్పుడు కొత్త మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏయే సమీకరణాలను బేరీజు వేసుకుని జగన్ తన టీమ్‌ను ఏర్పాటు చేస్తారనే దానిపై విశ్లేషణలు జోరందుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com