AP New DGP : ఏపీ కొత్త డీజీపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

AP New DGP : ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.. ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు వేసింది.. గౌతమ్ సవాంగ్ స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేస్తున్నారంటూ వార్తలు రావడం.. ఆ వెంటనే కసిరెడ్డి పేరు తెరమీదకు రావడం.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం.. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయ్. ప్రస్తుతం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన్నే ఇప్పుడు పోలీస్ బాస్‌గా చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ బాధ్యతలు కూడా రాజేంద్రనాథ్‌రెడ్డి వద్దే ఉంటాయి. ప్రస్తుతానికి గౌతం సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
నిజానికి గౌతం సవాంగ్ తర్వాత DGP రేసులో సీనియర్‌గా ద్వారకా తిరుమలరావు ముందు ఉన్నారని చెప్పాలి. కానీ ఆయన్ను కాదని 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. మే 2020 నుండి ఈ పదవిలో ఉన్న రాజేంద్రనాధ్ రెడ్డి.. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా సేవలందించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ GAD వంటి పదవులను నిర్వహించారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ DGPగా సేవలు అందించబోతున్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లాలోని నంద్యాల. ఆయన తండ్రి అక్కడే లెక్చరర్‌గా పనిచేశారు. ఇప్పటికీ అక్కడి వాళ్లందరితో రాజేంద్రనాథ్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజేంద్రనాథ్ రెడ్డి 2026 ఏప్రిల్ ౩౦ వరకు విధుల్లోఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ముగ్గురి పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.. కేంద్రం నుంచి అనుమతి రాగానే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తిబాధ్యతలు అప్పగించుంది.
ఇక, 2023 జూలై వరకు సవాంగ్‌కు సర్వీస్ ఉన్నప్పటికీ ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది.
అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com