AP: ఫేక్ న్యూస్ కట్టడికి కొత్త చట్టం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను సైతం విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. వీటిపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని కీలకంగా చర్చించింది. మంత్రులతో సోషల్ మీడియా పోస్టుల అరాచకంపై చర్చించిన సీఎం చంద్రబాబు అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐ ఫోటోలు, వీడియోలు, ఫేక్ న్యూస్ తో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం ఎక్కువైపోయిందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలపై చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటు చేశారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనలను రూపొందించనున్నారు.
కఠిన చర్యలు ఉండేలా...
తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికార కూటమికీ, విపక్షంలో వైసీపీకీ మధ్య సోషల్ వార్ తీవ్రంగా సాగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం తప్పుబడుతూ వైసీపీ సోషల్ వార్ సాగిస్తోంది. తాజాగా యూరియా అంశంలో కొరత ఉందంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. వీటిపై ఆగ్రహంగా ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేబినెట్ లోనే వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు.
సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారని డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో అన్నారు . స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని పవన్ అన్నారు. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా కేబినెట్ భేటీ తర్వాత.. మంత్రులతో చంద్రబాబు చర్చించారు . ఎరువులకు ఇబ్బంది లేకున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com