ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డపై కేంద్రానికి సీఎస్‌ లేఖ

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డపై కేంద్రానికి సీఎస్‌ లేఖ
ద్వివేది, గిరిజాశంకర్‌లను అభిశంసిస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించాలని సీఎస్.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చినా.. ఎస్ఈసీకి ఏమాత్రం సహకరించడం లేదు ప్రభుత్వం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాయడం సంచలనంగా మారింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌లను అభిశంసిస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించాలని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం తనకు లేని అధికారాలను వాడొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించాల్సిందిగా ఆయన కోరారు.

తమ విభాగంలో డిప్యుటేషన్‌పై విధులను నిర్వహించే అఖిల భారత సర్వీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా జీతభత్యాలు చెల్లించే ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం మినహా.. వారిని తొలగించడం లేదా శిక్షించే అధికారం ఎస్‌ఈసీకి లేదన్నారు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్. అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు సంబంధించిన నిర్దేశిత మార్గదర్శకాలను పాటించకుండా.. ఈ ఏడాది జనవరి 1నాటికి గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను రూపొందించడంలో విఫలమయ్యారంటూ ద్వివేది, గిరిజాశంకర్‌లకు ఎస్‌ఈసీ అభిశంసన ఆదేశాలిచ్చిందని తెలిపారు. వారిద్దరినీ ఉద్దేశించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అమర్యాదపూర్వకంగా లేఖ రాశారని సీఎస్‌ ఆక్షేపించారు. ఎస్‌ఈసీకి అభిశంసన అధికారం లేదని.. తన పరిధిని అతిక్రమించిందని తెలిపారు. తన పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సూచన చేసే అధికారం మాత్రమే దానికి ఉందన్నారు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.

అఖిల భారత సర్వీసు ఉద్యోగుల సర్వీసు మార్గదర్శకాలు-1969 ప్రకారం సూక్ష్మ శిక్షలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధిపతులు మాత్రమే విధించగలరని లేఖలో పేర్కొన్నారు. అధికారం లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌.. ఇద్దరు అధికారుల అభిశంసనకు ఆదేశాలిస్తూ.. వారి సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారని.. ఈ ప్రొసీడింగ్స్‌ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఎస్‌ఈసీ అనాలోచితంగా ఇచ్చిన ఇలాంటి ఆదేశాలతో అధికారులు ఇబ్బందిపడకూడదన్నారు. వారిపై ఇచ్చిన అభిశంసన ఆదేశాలను తిరస్కరించాలని డీవోపీటీ కార్యదర్శిని కోరారు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్.


Tags

Read MoreRead Less
Next Story