బలవంతపు ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల అక్రమాలపై స్పందించాలని.. అందుకోసం అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. బలవంతపు ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.. నిష్పాక్షిక ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. బలవంతపు ఏకగ్రీవాలపై దృష్టిపెట్టాలని ఎస్‌ఈసీకి సూచించింది. పిటిషనర్లు ఆరోపణలు నిజమైతే అవి తీవ్రమైనవిగా అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె, గుంటూరు జిల్లా మాచర్లలో బలవంతంపు ఏకగ్రీవాలు జరిగాయని, వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్లు విఫలమయ్యారని పేర్కొంటూ టీడీపీ నేత అనీషారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయన్నారు.. ఒకవేళ నామినేషన్ వేసినా తిరస్కరిస్తున్నారని, అందుకు సరైన కారణాలు కూడా చపించడం లేదని కోర్టుకు వివరించారు. చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఈసీ కూడా నోటిఫికేషన్‌తో తన బాధ్యత తీరిపోయినట్లుగా భావిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు పంపుతున్నట్లు ఎస్‌ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయాలని.. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది కలుగజేసుకుని ఈ పిటిషన్లకు విచారణార్హతే లేదన్నారు.
వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు కీలక వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఈ దశలో న్యాయస్థానం లోతైన అంశాల్లోకి వెళ్లడం లేదని.. ఉత్పన్నమవుతున్న అంశాలపైనే దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. తనకున్న అధికారాలను వినియోగించి ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. ఇదే అంశాలకు సంబంధించి పలు వ్యాజ్యాలు దాఖలవుతున్న నేపథ్యంలో ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. పిటిషనర్ల ఫిర్యాదులు, అందించిన వినతులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com