రాయలసీమ పల్లెల్లో రెండో విడత పంచాయతీ పోరుపై తీవ్ర ఉత్కంఠ

రాయలసీమ పల్లెల్లో రెండో విడత పంచాయతీ పోరుపై తీవ్ర ఉత్కంఠ
ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

ఏపీలోని 13 జిల్లాల్లో 3,328 గ్రామ పంచాయతీలు, 33 వేలా 570 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2 వేలా 786 పంచాయతీలు, 20 వేల 796 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.. సర్పంచ్ పదవి కోసం 7 వేలా 510 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడత ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల స్థితిగతులను SEC ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది.

రెండో దశ ఎన్నికల కోసం 29,304 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 5,480 సున్నితమైనవి కాగా, 4,181 అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్‌ జరుగుతుంది.. కరోనా సోకిన వారు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పరిశీలించనున్నారు అధికారులు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిశీలిస్తారు.

విశాఖ జిల్లాలో మొదటి దశలో అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు జరగ్గా.. రెండో దశలో నర్సీపట్నం డివిజన్‌లో జరుగుతున్నాయి. నర్సీపట్నం పరిధిలో 239 గ్రామ పంచాయతీలు, 2 వేల 584 వార్డులకు ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 581 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. డివిజన్‌లో మొత్తం 4 లక్షల 69 వేల 583 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 6 వేల 470 మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇక 400 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 2 వేల 184 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

అటు రాయలసీమ పల్లెల్లో రెండో విడత పంచాయతీ పోరుపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కర్నూల్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామమైన రుద్రవరంలో సర్పంచ్ స్థానాన్ని టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు. అటు గ్రామానికి రోడ్లు వేయలేదని పూడూరు గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరులో రెండో విడత పంచాయతీ ఎన్నిలు జరిగే పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై కోడుమూరు మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. మూడో దశలో ఎన్నికలు జరిగేవాటిలో 3 వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ నెల 17న మూడో దశ పోలింగ్ జరుగనుంది. ఇక నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. గురువారం అమావాస్య కావడంతో నామినేషన్లు మందకొడిగా దాఖలయ్యాయి. నాలుగో విడత పోలింగ్ జరిగేవాటిలో 13 జిల్లాల్లోని 3 వేల 299 పంచాయతీలు, 33 వేల 434 వార్డు స్థానాలున్నాయి. నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న జరుగనుంది.

Tags

Read MoreRead Less
Next Story