AP: వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదులు

ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చెప్పారని రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. వైసీపీ నేతల వేధింపుల వల్లే తాము తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని... వారిపై పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు . తమ ఉద్యోగాలు తమకు మళ్లీ ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 13,609 మంది వాలంటీర్లు ఉండగా- సుమారు 200 మందిని ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో విధుల నుంచి తొలగించారు. మరో 4,539 మంది వరకు రాజీనామాలు చేశారు. వారిలో కొందరు తమను వైసీపీ నాయకులు బెదిరించి రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 41వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ విజయలక్ష్మితో పాటు మరికొందరు నాయకులపై ఈ నెల 15న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆదివారం 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి, నాయకులు సురేష్‌రెడ్డిలపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయసలహా తీసుకున్న చిన్నబజారు పోలీసులు కోర్టు ఆదేశాలతో కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపీ నాయకులు మధుసూదన్‌రావు, బాబ్జీలపై కేసు నమోదు చేశారు.
నేడు అమరావతికి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి.. శంకుస్థాపన ప్రాంతం, వివిధ దశల్లో ఉన్న నివాస సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అని అధికారులు మథనపడుతున్నారు. మరోవైపు అమరావతిలోని అన్ని ప్రాంతాలను పరిశీలించనున్న చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో పర్యటించనున్నారు.
షర్మిల ఓడింది అందుకేనట..
ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం జగన్, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి.. కడప ప్రజల్ని భయపెట్టారని, అందుకే కడప ఓటర్లు తనకు ఓటు వేయలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. షర్మిలకు ఓటు వేశారని తెలిస్తే తమను ఇబ్బంది పెడతారని కడప ప్రజలు భయపడ్డారని అన్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వస్తే, తమకు ఎదురు తిరిగిన వారికి పథకాల్లో కోత పెడతారనే ప్రచారం కూడా జరిగిందని, అందుకే కడప ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని షర్మిల అన్నారు. పథకాలు పోతాయనే భయంతో అందరూ వైసీపీకి ఓటు వేశారన్నారు. తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందని షర్మిల తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com