CASE: మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు

వైసీపీ అధినేత జగన్, జగన్ ప్రభుత్వంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన పీవీ సునీల్‌కుమార్, ఐపీ చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారంటూ ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదు చేశారు. అప్పట్లో సీఐడీ అదనపు ఎస్పీగా పనిచేసిన ఆర్.విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతితో పాటు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాల్లోని లోపాలను బయటపెడుతూ నాటి సీఎం జగన్‌పై విమర్శలు చేసినందుకు అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్న నాపై మూడేళ్ల కిందట సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.
తనను రాత్రంతా ఓ గదిలో నిర్బంధించి సునీల్‌కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు సీఐడీ కార్యాలయానికి వచ్చి రబ్బరు బెల్ట్, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. అప్పటికే తాను బైపాస్ సర్జరీ చేయించుకుని కొద్దిరోజులే అయ్యిందని... ఆ మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదన్నారు. కొందరు వ్యక్తులు తన ఛాతీపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేందుకు యత్నించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ తీసుకుని దాని పాస్‌వర్డ్ చెప్పేంత వరకూ తీవ్రంగా కొట్టారన్నారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని బెదిరించారని అన్నారు. జగన్ ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింద’ని రఘురామ ఇటీవల గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, దానిపై న్యాయ సలహా తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అరాచకాలపై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన తొలి కేసు ఇదే కావడం విశేషం. సీఐడీ కస్టడీలో తనను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు మూడేళ్లుగా అనేక వేదికలపై చెబుతున్నారు. సంబంధిత ఆధారాలు, నివేదికలన్నీ బయటపెట్టారు. నాడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఆయన వేదన అరణ్య రోదనే అయ్యింది. కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో రఘురామ అప్పట్లో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్, హత్యాయత్నం ఘటనలపై గుంటూరు పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. హత్యకు యత్నించిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు యత్నించిన వారిని కూడా బాధ్యులుగా చేయాలని కోరారు. తీవ్ర రక్తగాయాలయ్యేలా చితక్కొట్టినా వైద్య పరీక్షల తర్వాత అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట ప్రభావతి ‘రిమాండ్‌కు ఫిట్’ అనేలా తప్పుడు నివేదిక ఇచ్చారని రఘురామ ఆరోపించారు. సీఐడీ అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారని, అందుకే ఆమెనూ ఈ కేసులో బాధ్యురాలిగా చేయాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రభావతిని ఐదో నిందితురాలిగా చూపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com