AP: సోషల్ సైకోలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం

వైసీపీ ప్రభుత్వ పాలనలో సోషల్ మీడియా అసభ్య కామెంట్లు, పోస్టులతో చెలరేగిపోయిన సైకోలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా పోస్టుల కేసులపై పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 15 మందికి 41ఏ నోటీసులు జారీచేశారు. వైసీపీ సోషల్ మీడియా కీలక నిందితులు భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలతో పాటు మరో13 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టులు పెడుతున్న సైకోలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసభ్యకరపోస్టుల పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
మరో 17మంది అరెస్ట్
తుని పరిధిలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురిని రిమాండ్ కోసం కోర్టుకి తరలించారు. అరెస్ట్‌లపై తుని రూరల్ సర్కిల్ సీఐ మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర గ్రూపుల్లో వచ్చిన అసభ్య పోస్టులను కూడా షేర్ చేయకూడదని తెలిపారు.షేర్ చేసినా కామెంట్స్ పెట్టినా శాంతి భధ్రతలకుభంగం కలిగించినా నేరమే అని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టినా ఇలాంటి పోస్టులు పెట్టొద్దు’’ అని పోలీసులు తేల్చి చెప్పారు.
సీరియస్ గా ఉన్న ప్రభుత్వం
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వ పెద్ద సీరియస్‌గా తీసుకోవడంతో సోషల్ మీడియా సైకోలు దారికి వస్తున్నట్లు తెలుస్తోంది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేయడం.. వారు పెట్టిన పోస్టులను బట్టి... నోటీసులు ఇవ్వడం, కౌన్సెలింగ్ చేయడం, కేసులు పెట్టడం, అవసరమైన చోట అరెస్టులూ చేస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా విషయం వివరిస్తున్నారు. గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన వారిని స్టేషన్లకు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. లైకులు కొట్టిన వారికి వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా 160 సీఆర్పీసీ నోటీసులు పంపారు. మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకరమైన వీడియోలు సృష్టించిన వారిపై భారత న్యాయ సంహితలో వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన సెక్షన్ 111 ప్రయోగిస్తున్నారు. పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్ సైకోలు పలువురు రాష్ట్రం విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ‘ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి’ అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు. దాదాపు నెలరోజుల్లోనే వందల సంఖ్యలో సోషల్ సైకోలను పోలీసులు గుర్తించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టినా, మరొకరికి పంపినా ఇబ్బందులో పడినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com